ముంబై: భారత నావికాదళం అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ ఖండేరి జలాంతర్గామి వచ్చి చేరింది. ఐఎన్ఎస్ ఖండేరిని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ముంబైలోని మజగాన్
తీరం వద్ద సముద్ర జలాల్లోకి పంపించారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతూ... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు దేశాల తలుపు తట్టి సాధించిందేమీ లేదని, కాని ఆయన కార్టూనిస్టులకు పని కల్పించారని ఎద్దేవా చేశారు. ఖండేరి చేరికతో భారత నావికాదళం మరింత పటిష్ఠమైందని చెప్పారు. పాకిస్థాన్ కుట్రలను తిప్పికొట్టేందుకు భారత త్రివిధదళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1965, 1971లలో పాకిస్థాన్ చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతం చేస్తే సహించేది లేదని మంత్రి రాజ్ నాథ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు నావీ చీఫ్ అడ్మిరన్ కరంబీర్ సింగ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.