ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే
ఆయా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాలను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కాగా... ఈ ఎన్నికలను దీపావళి (అక్టోబర్ 27) పండుగ కంటే ముందే పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆ రెండు రాష్ర్టాల్లో ఎన్నికల కోడ్ నేటి నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు... జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.