మంచిర్యాల: జిల్లా నడిబొడ్డున NIA అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. నిన్న(శుక్రవారం) మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఇక్బాల్ అహ్మద్ నగర్ లోని
రిటైర్డు ప్రభుత్వ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి దాదాపుగా 7 గంటల వరకు సోదాలు చేసి డాక్టర్ ను పలు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. కాగా... ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. సోదాల్లో ఆయన ఇంటి నుంచి రెండు ఫోన్లు, ఒక కంప్యూటర్ హార్డ్ డిస్క్, విప్లవ సాహిత్యం పుస్తకం సీజ్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అనంతరం ఈ ఘటనపై స్పందించిన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... మహిళ మావోయిస్ట్ కు వైద్యం అందించిన ఆధారాలతో సోదాలు చేసినట్లు డా.చేంద్రశేకర్ చెప్పాడు. కొద్ది రోజుల క్రితం నిర్మల అనే ఓ మహిళ క్యాన్సర్ పేషెంట్ సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ కు వస్తే తాను వైద్యం చేసినట్టు చెప్పాడు. ఆమె ఇటీవల పోలీసుల వద్ద లొంగిపోయిందని ఆమె పేరు నర్మద అలియాస్ నిర్మలగా తెలిసిందని డాక్టర్ చెప్పారు. ఆమె నుంచి సేకరించిన సమాచారంతో నా ఇంట్లో సోదాలు చేసి స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు.
ప్రభుత్వ వైదుడిగా గతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో పనిచేసి మంచి పేరు తెచుకున్నందున నన్ను మావోయిస్ట్ సానుభూతి పరుడిగా భావించి సోదాలు చేశారని చెప్పుకొచ్చారు. నావద్ద గతంలో ఎప్పుడో బుక్ ఎగ్జిబిషన్ లో కొనుగోలు చేసిన ఒక పుస్తకం, ఒక సీడీ... పాత న్యూస్ పేపర్ ఉంటే వాటిలో వార్తల కారణంగా కొంత అనుమానించి ప్రశ్నించారని డాక్టర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.