హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్రబంద్ నేతల అరెస్టులతో పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బస్సులు
డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కాగా... బంద్ ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, రాణిగంజ్, కంటోన్మెంట్‌ల్లోనూ బస్సులను డిపోల నుంచి కదలనివ్వకుండా కార్మికులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
బంద్ సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పటాన్‌చెరులోని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శి గోదావరి అంజిరెడ్డిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఎంజీబీఎస్ వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నేత హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్ నేపథ్యంలో బస్‌భవన్ వద్దకు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు రాకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరా పార్క్ నుంచి బస్‌భవన్‌కు టీజేఎస్ నేతలు భారీ ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుభవన్ లోపలికి ఇతరులు ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్‌భవన్ మార్గంలో సీసీ కెమెరాలతో నిఘా పటిష్ఠం చేసిన పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కొన్ని చోట్ల బంద్ ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో బస్సులపై రెండు చోట్ల (అచన్‌పల్లి, ముజారక్ నగర్)లో రాళ్లు రువ్వడంతో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో బస్సు నడుపుతోన్న తాత్కాలిక డ్రైవర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో బండ్లగూడ డిపో వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకుంది. బస్సుల్లో గాలితీసి ఆందోళనకారులు డీజిల్ ట్యాంకర్‌ను పగులగొట్టారు.