హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య కేసు దర్యాప్తు స్పీడందుకుంది. బంజారాహిల్స్ ఎసిపి నేతృత్వంలోని ఓ ప్రత్యేక బృందం ఈ కేసును లోతుగా
అధ్యయనం చేస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఎనిమిది కాల్ చేసిన కోడెల చివరగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ కి కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అన్న మిస్టరీని టెక్నికల్ సపోర్ట్ తోనే ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు. అసలు కోడెల కేసులో పోలీసులు తెలుసుకున్న వాస్తవాలేంటో ఓ లుక్కెద్దాం.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కేసు తెలంగాణ పోలీసులకు ఓ ఛాలెంజ్ గా మారింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును ఛేదించాలని బంజారాహిల్స్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకోసం బంజారాహిల్స్ ఎసిపి శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం లోతుగా అధ్యయనం చేస్తోంది. కోడెల ఫోన్ కాల్స్ లిస్టు సేకరించిన పోలీసులు ఆయన ఉదయం ఎనిమిది కాల్స్ చేసినట్లు గుర్తించారు.
అందులో చివరకు 24 నిమిషాలపాటు మాట్లాడిన కాల్ పై ఆరా తీశారు. కాల్ డేటాని సేకరించిన పోలీసులు కోడెల తన ఫోన్ నుండి చివరి సారిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమతితో మాట్లాడినట్లు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలని ఉదయాన్నే కోడెల డిసైడ్ అయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే డాక్టర్ తో ఏం మాట్లాడాడు అన్న విషయాలు తెలియాలంటే సుమతిని విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసే మోచనలో పడ్డారు పోలీసులు.
20 రోజుల కిందటే హైదరాబాద్ కి వచ్చిన ఆయన తన పార్టీ నేతలతో కానీ, కార్యాకర్తలతో కానీ, చివరకు దగ్గరి బంధువులతో సైతం మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఇంట్లో మాత్రమే మౌనంగా ఉంటూ తన గదిలో ఒంటరిగా ఆలోచిస్తూ ఉండేవారని తెలిసింది. ఈ కేసులో కోడెల శివరాంకి ఎలాంటి సంబంధం లేదని బంజారాహిల్స్ పోలీసులు చెబుతుండగా, ఆయన భార్య, కూతురు, గన్ మెన్, డ్రైవర్ తో పాటు ఇంటికి కాపలా ఉన్న మరో నలుగురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో సహా ఎనిమిది మందిని ఐ విట్ నెస్ లుగా కేసులో పొందుపరిచారు.
ఈ కేసులో డాక్టర్ సుమతితో పాటు, మరికొంత మందిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. తనపై అధికారపార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న సమయంలో సహచర పార్టీ నేతలు ఎవరూ ఆరోపణలు ఖండించక పోవడం, తనకు మద్దతు తెలపకపోవడంపై కూడా కోడెల మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో అతని కూతురు విజయలక్ష్మీ ఏపీ ప్రభుత్వం పెట్టిన వేధింపులకు తట్టుకోలేకే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.