నల్గొండ జిల్లాలో బోరుబావిలో పడిన మూడున్నరేళ్ల బాలుడి ఘటన విషాదాంతమైంది. బోరుబావి నుంచి బాలుడిని రక్షించేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.
రెండున్నర గంటల పాటు శ్రమించి బాలున్ని బయటకు తీసినా.. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచాడు. శివ అనే మూడున్నరేళ్ల బాలుడు బోరు బావిలో పడి మృతి చెందిన దుర్ఘటన ఆదివారం నల్గొండ జిల్లా, పెద్దవూర మండలంలోని పులిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది.
బాలగోని నర్సింహగౌడ్, సరితల ఏకైక కుమారుడు శివ. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తల్లిదండ్రులతో పాటు శివ పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవగా.. శివ తన అక్కలతో కలిసి పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం వేసిన బోరు బావిలో ఒక్కసారిగా జారి పడిపోయాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సమీపాన రైతులతో కలిసి తాడు సాయంతో శివను పైకి లాగడానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోయేసరికి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో.. ఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ, ప్రొక్లెయినర్ల సాయంతో బోరుబావి చుట్టూ గుంతను తవ్వి బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు.
దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, హాలియా సీఐ పార్థసారధి సంఘటనాస్థలానికి చేరుకొని మరికొన్ని యంత్రాల సాయంతో బాలుడిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండున్నర గంటల అనంతరం బోరుబావి లోంచి బాలుడిని బయటకు తీశారు.
అనంతరం.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన శివను నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. ముక్కపచ్చలారని బాలుడు శివ మృతితో పులిచెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శివ