కేశవరెడ్డి స్కూల్స్... ఓ బడా కార్పొరేట్ స్కూల్స్ చైన్... పదుల ఎకరాల్లో క్యాంపస్ లు... పెద్ద పెద్ద బిల్డింగ్ లు.. ఆధునిక వసతులంటూ అకడమిక్ ఇయర్ ప్రారంభంలో ఏ పేపర్ చూసినా...టీవీ ఛానల్ ట్యూన్ చేసినా ఈ స్కూల్ ప్రకటనలే భారీగా కనిపిస్తాయి.
మరి ఇంత పెద్ద విద్యా సంస్థను ప్రారంభించాలంటే ఎవరైనా సహజంగా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలనేది అందరూ కాదనలేని నిజం. కానీ కేశవరెడ్డి విద్యాసంస్థలు ఎలా ఎదిగాయో...ఎవరి డబ్బులతో బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు స్థాపించారో తెలుసుకుంటే బడా బడా ఆర్థికవేత్తలకే ఆశ్చర్యం వేయక మానదు.
ఒక సంస్థను ప్రారంభించి... ఆ సంస్థ మార్కెట్లో ఎదుగుతూ అందరి మన్ననలు పొందితే ....తిరిగి ఆ సంస్థను విస్తరించాలనుకుంటే ఏ పెట్టుబడిదారైనా తమ దగ్గరున్న మూల ధనాన్ని ఉపయోగిస్తారు. లేదంటే తమ సంస్థ షేర్లను అమ్మి పెట్టుబడులు సేకరిస్తారు. ఇది పెట్టుబడుల సేకరణలో కనీస వ్యాపార సూత్రం. ఇందుకోసం అవసరమైన అన్ని అనుమతులు ఆ సంస్థలకు తప్పనిసరి. కాని కేశవరెడ్డి స్కూల్స్ మాత్రం తమ విద్యాసంస్థల విస్తరణకు తప్పుడు పంథాను ఎంచుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. ఈ స్కూళ్లో చదివిన విద్యార్ధుల తల్లిదండ్రులు... సీవీఆర్ న్యూస్ కి ఇచ్చిన ఫిర్యాదుతో కేశవరెడ్డి ఆర్ధిక అవకతవకల భాగోతం బయటపడింది.
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో ఐదేళ్లక్రితం కేశవరెడ్డి విద్యాసంస్థలను ప్రారంభించారు. ఈ స్కూళ్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఇక సంగారెడ్డిలోని కేశవరెడ్డి పాఠశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 400మందికి పైగా బోర్డింగ్ విద్యార్థులు కాగా, మిగతా విద్యార్థులు డేస్కాలర్స్. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ఆఫర్ పేరుతో ఒక అనధికారిక స్కీంను పాఠశాల యాజమాన్యం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థి ....మొదట మూడు లక్షల రూపాయలు చెల్లించాలి. డే స్కాలర్ విద్యార్థి అయితే రెండు లక్షల రూపాయల చెల్లించాలి. ఇలా ఒక్కసారి చెల్లిస్తే విద్యార్ధి... పాఠశాలలో చదివినన్ని రోజులు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంతో పాటు బోర్డింగ్... ఉచిత హాస్టల్ సదుపాయం కల్పిస్తామని పాఠశాల యజమాన్యం తెలిపింది.
విద్యార్థి పాఠశాల నుంచి వెళ్లిపోయేటప్పుడు పేరెంట్స్ ఇచ్చిన మొత్తం అంటే హాస్టల్ విద్యార్థులు చెల్లించిన మూడు లక్షలు, డేస్కాలర్ విద్యార్థులు చెల్లించిన రెండు లక్షల తిరిగి ఇస్తామనేది పాఠశాల యజమాన్యం ఒప్పందం. ఇందుకోసం డబ్బులు చెల్లించిన పేరెంట్స్ కు కళాశాల యజమాని కేశవరెడ్డి.... విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అప్పు తీసుకున్నట్లుగా ఒక ప్రామిసరీ నోట్ ను అందించారు. అంటే విద్యార్థి చదువుకున్నంత కాలం పేరెంట్స్ ఇచ్చిన మొత్తానికి వచ్చిన వడ్డీతో విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటారనేది పాఠశాల ప్రచారం చేసిన పథకం ఉద్దేశ్యం. ఆర్థికంగా కొంచెం స్థితిమంతులైనవారు ఈ వడ్డీ పథకానికి ఆకర్షితులయ్యారు. అసలుకు అసలు మిగులుతుంది. వడ్డీతో విద్యార్థులు చదువుతారన్న ఆశతో వందలాది విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి తమ పిల్లలను ఇందులో చేర్పించారు. ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి... కేవలం సంగారెడ్డి బ్రాంచి నుండే ... ఈ ఐదేళ్లలో సుమారు 30కోట్లు అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కేశవరెడ్డి యాజమాన్యం రాబట్టింది.
కేశవరెడ్డి స్కూల్స్ లో ఇంత తంతు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతవరకు గుట్టుగా ఈ వ్యవహారాన్ని కొనసాగించి కేశవరెడ్డి యజమాన్యం...కొందరు పేరెంట్స్ కు డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదువు పూర్తయిన కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు తాము ఇచ్చి డబ్బులు ఇవ్వమని పాఠశాల యజమాన్యాన్ని అడగగా రేపు...మాపు అంటూ పాఠశాల చుట్టూ తిప్పుతున్నాయి. తమకు నష్టం వచ్చిందని....ఇచ్చిన మొత్తం నుంచి సగం మినహాయించుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చారని.... లేనిపక్షంలో మీకు దిక్కున్న చోటు చెప్పుకొండని బెదిరించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ వచ్చి పాఠశాలలో ఆందోళన చేస్తుండటంతో కొంత మొత్తాన్ని కేశవరెడ్డి సంస్థలు ఇస్తున్నాయి. మిగతా మొత్తానికి రేపు మాపు అంటూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
డిపాజిట్ చేసిన తల్లిదండ్రులు...వందల సంఖ్యలో ఉన్నారు. తమ పిల్లలు ఇంకా అదే పాఠశాల చదువుతుండటంతో ఏమి ఇబ్బందులు వస్తాయోనన్న ఆలోచనలతో చాలామంది పేరెంట్స్ నోరు మెదపడం లేదు. తమ డబ్బులు ఎలా తిరిగి వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ కేశవరెడ్డి యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
కేశవరెడ్డి తీరు పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు తెలిపారు. తన ముఫ్పై ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి సేకరణ వినలేదని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
ఒక్క సంగారెడ్డి బ్రాంచ్ నుంచే అక్రమంగా ముప్పై కోట్ల డిపాజిట్స్ సేకరించిన కేశవరెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్ లున్నాయి. అక్కడ ఎంత డిపాజిట్స్ సేకరించారో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చట్టవిరుద్ధంగా నిధుల సేకరణ జరిపిన కేశవరెడ్డి యాజమాన్యంపై ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.