ఇప్పటికే 150 చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో, మెగాస్టార్ చిరంజీవి... ఆయన తొలిసారి స్వాతంత్ర సమరయోధుడిగా నటించిన హిస్టారికల్ మూవీ 'సైరా నరసింహారెడ్డి' ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే.. ఈ సినిమా ఎలా ఉందంటే
కథ: 18వ శతకంలో ప్రథమ స్వాతంత్ర్య పోరాట సమయంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయ్ (అనుష్క) తన సైనికుల్లో స్ఫూర్తి నింపడానికి రేనాడు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను చెప్పడంతో సినిమా ప్రారంభంలోనే దర్శకుడు అభిమానులను కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 1847లో బ్రిటీష్ వారు పరిపాలనలో ఉన్న 61 మంది పాలెగాళ్లలో రాయలసీమలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన పాలెగాడు నరసింహారెడ్డి (చిరంజీవి) ఒకరు. అయితే... ఒకసారి తీవ్రమైన కరువు వచ్చినప్పటికీ బ్రిటీష్‌వారు ఆ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులను పన్నులు కట్టమని వేధించేవారు. దీంతో గురువు గోసాయి ఎంకన్న(అమితాబ్ బచ్చన్) స్ఫూర్తితో బ్రిటీష్‌వారు చేసే అకృత్యాలు చూడలేక నరసింహారెడ్డి వారిపై ఎదురుతిరుగుతాడు. ఈయనకు అవుకు రాజు(కిచ్చాసుదీప్), రాజా పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతిబాబు) తదితరులు అండగా నిలుస్తారు.
అయితే... బ్రిటీష్‌వారికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా ఎదిరించాడు. వారితో నరసింహారెడ్డి ఎలాంటి పోరాటాలు చేశాడు. చివరకు ఆయన్ని బ్రిటీష్‌వారు ఎలా బంధించి ఉరి తీశారనేది సినిమాలో చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో అవుకురాజు పాత్రలో కిచ్చాసుదీప్, రాజాపాండి పాత్రలో విజయ్ సేతుపతి, సిద్ధమ్మ పాత్రలో నయనతార, లక్ష్మీ పాత్రలో తమన్నా, వీరారెడ్డి పాత్రలో జగపతిబాబు ఇలా అందరూ వారి వారి పాత్రలకు తమ నటనతో సినిమాను హై లెవెల్ కి తీసుకెళ్లారు.