హైదరాబాద్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ భారీ క్యాంపస్ ను తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా
మంత్రి అలీ మాట్లాడుతూ... అమెజాన్ కంపెనీ తమ అతిపెద్ద క్యాంపస్ ను అమెరికా తర్వాత మన గచ్చిబౌలిలోని నానక్‌రామ్ గూడలో ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద బిల్డింగ్ అని తెలుపారు. అమెజాన్ ఇండియా మేనేజర్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ... గత 15 ఏళ్లలో ఇండియాలో అమెజాన్ ఎదుగుదలను వివరించారు. కొన్నేళ్ల క్రితం అమెజాన్ ఏర్పాటుకై కేవలం అయిదు మంది సభ్యులతో ఇక్కడకు వచ్చామని, ఇప్పుడు ఇండియాలో సుమారు 62 వేల మంది పనిచేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమెజాన్ ఇండియా న్యూ క్యాంపస్ అద్భుతమని మెచ్చుకున్నారు. హైదరాబాద్ మహానగరానికి ఇది మరో మణిహారంగా మారుతుందన్నారు. ఈ క్యాంపస్ తో రాష్ట్ర, నగర రూపురేఖలు మారుతాయని జయేశ్ రంజన్ అభిప్రాయపడ్డారు. అలాగే... ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్, ఎంఎల్ టెక్‌లోనూ అమెజాన్ తన సేవల్ని అందించనుందన్నారు.