ప్రస్తుత తరుణంలో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం ఆవశ్యకంగా మారిందని... కొంతమందికి దుస్తులను శుభ్రం చేసుకోవటానికి కూడా సమయం ఉండడంలేదని అలాంటి వారికో
వరంగా 'లాండ్రీ కార్ట్' ఉపయోగపడుతుందన్నారు సమంత అక్కినేని. ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్... అలేఖ్య, గిరిజ, శరత్‌లతో కలిసి నెలకొల్పిన 'లాండ్రీ కార్ట్' సంస్థ మొబైల్ యాప్ సర్వీస్‌ను ఆదివారం హైదరాబాద్‌లో సమంత ప్రారంభించారు. ఈ సందర్భంగా 'లాండ్రీ కార్ట్' వ్యవస్థాపకురాలు తబితా సుకుమార్ మాట్లాడుతూ... "ఏడాదిన్నర పాటు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత గత ఏడాది జూన్‌లో 'లాండ్రీ కార్ట్'ను ప్రారంభించాం. సినిమా నేపథ్యంతో ముడిపడిన సంస్థ కాదిది. మధ్యతరగతి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ వ్యయంతో సర్వీసులను అందించాలని ప్రారంభించాం. వ్యాపారం చేయాలనే ఆలోచనతో కాకుండా సేవ చేస్తూనే చాలా మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో లాండ్రీ కార్ట్ సంస్థను ప్రారంభించాం. ఇందులో ప్రీమియం లాండ్రీ, డ్రైక్లీనింగ్ పేరుతో రెండు రకాల సర్వీసులను అందిస్తున్నాం. ప్రీమియం లాండ్రీలో రోజువారి దుస్తులను శుభ్రం చేస్తాం. డ్రైక్లీనింగ్‌లో బ్రాండెడ్ దుస్తులాంటి ఖరీదైన వాటిని శుభ్రం చేస్తాం. ఇతర వ్యాపార సంస్థలతో భిన్నంగా ఏదైనా చేయాలనే దీనిని ప్రారంభించాం" అని అన్నారు.