మగువల మనసు మెచ్చేది..నచ్చేది..మగువ అందానికే బంగారు వన్నె తెచ్చేదేదైనా ఉందంటే..అది బంగారమే. ఇప్పుడు ఆ బంగారం ధరలే
ఆకాశాన్ని దిగి వస్తున్నాయి. మంగళ, బుధవారాలు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు వరుసగా మూడోరోజు గురువారం కూడా తగ్గాయి. ఇది పూర్తిగా పెళ్లిళ్ల సీజనే అయినప్పటికీ బంగారం ధర తగ్గుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశీయ జూవెలర్లు, రిటైలర్ల నుంచి బంగారానికి అంతగా డిమాండ్ లేకపోవడంతో గురువారానికి భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.80 తగ్గి రూ.32,670కి పడిపోయింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ. 80 తగ్గి రూ.32,670గా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా పది గ్రాములకు రూ.80 తగ్గి రూ.32,500 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400గా ఉంది. వెండి ధర కూడా బంగారం బాటలో నడిచి కిలోకు రూ.90 తగ్గి రూ.38,330కి పడింది. బంగారం ధర తగ్గడానికి కారణాలేవైనా కానీ...ఈ ఉగాదికి మాత్రం మగువలకు బంగారం పండుగ శోభను తెచ్చిపెడుతోంది.