ఢిల్లీ : కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి తృప్తినిచ్చే నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. మధ్య స్థాయి ఆదాయ వర్గాలకు అందుబాటులో ఉండే ఇండ్లు, అపార్టుమెంటుల్లోని
ఫ్లాట్ ల అమ్మకాలపై 8 శాతంగా ఉన్న జీఎస్టీ రేటుని ఒక శాతంగా నిర్ణయించినట్లు శుభవార్త తెలిపింది. అదే విధంగా మధ్య స్థాయి ఆదాయ వర్గాల కన్నా కొంచెం ఎక్కువ స్థాయివారు కొనే ఇండ్లపై 12 శాతం గా ఉన్న జీఎస్టీ రేటుని 5 శాతంగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో రియాల్టీ రంగానికి, మధ్య తరగతి వేతన జీవులకి కొత్త ఊపొచ్చింది.
మరోవైపు, మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా వరకు... అలాగే, ఇతర చోట్ల 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా వరకు... ఇళ్ళను మధ్యాదాయ వర్గాల ఇళ్ళుగా వర్గీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నూతన పన్ను రేట్లు వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే, ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది.