ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడం ఆ సంస్థ షేర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్లో టాటా మోటార్స్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్కెట్ ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన షేర్లు.. కాసేపటికే భారీగా పతనమయ్యాయి. ఒక దశలో 20శాతానికి పైగా నష్టపోయాయి. క్రితం సెషన్లో బీఎస్ఈలో రూ.182.90 వద్ద ముగిసిన షేరు విలువ నేటి ట్రేడింగ్లో రూ. 164.65 వద్ద ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిసేపటికే 23శాతం నష్టపోయి షేరు విలువ రూ. 141.90కి పడిపోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే సాగుతున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో టాటా మోటార్స్ షేరు విలువ బీఎస్ఈలో 15.17శాతం నష్టంతో రూ. 155.15 వద్ద, ఎన్ఎస్ఈలో 15.07శాతం నష్టపోయి రూ. 155.30 వద్ద ట్రేడ్ అవుతోంది. డిసెంబరు 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.26,960.8 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేయగా... గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.1,214.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం గమనార్హం. జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఆస్తుల్లో ఒకేసారి తలెత్తిన బలహీనత వల్లే ఈ స్థాయి నష్టం ప్రకటించాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.