ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ గుజరాత్‌లోని
12 లక్షల మంది చిన్న రిటైలర్లు, షాప్‌కీపర్లతో రిలయన్స్ జియో - రిలయన్స్ రిటైల్ ఏకం చేసి ఒక ఆన్‌లైన్ స్టోర్ ను ఏర్పాటు చేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ జియోకు దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇక రిలయన్స్ రిటైల్ నెట్‌వర్క్‌లో దేశ వ్యాప్తంగా దాదాపు 10 వేల అవుట్‌లెట్లు ఉన్నాయి. ఇందులో 6,500 అవుట్‌లెట్లు పట్టణాలు, నగరాల్లో ఉన్నాయి.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థల విషయంలో నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఆ నిబంధనల్లో... తమ వాటాలు ఉన్న సంస్థల ఉత్పత్తులను విక్రయించరాదని.... అలాగే, ఏదైనా ఉత్పత్తిని తమ ఫ్లాట్‌ఫాంలోనే ఎక్స్‌క్లూజివ్‌గా కొనాలని వినియోగదారులను బలవంతం చేయకూడదని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో అమెజాన్, వాల్‌మార్ట్ సొంతమైన ఫ్లిప్‌కార్ట్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే రిలయన్స్ వంటి స్థానిక దేశీయ సంస్థలకు మేలు చేసేందుకే ఇటువంటి నిబంధనలు తీసుకొస్తున్నట్టు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ నుంచి త్వరలోనే రానున్న ఆన్‌లైన్ స్టోర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఏడాది జూలైలో అంబానీ వెల్లడించనున్నారని తెలుస్తోంది.