స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా సవరించిన
వడ్డీ రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. కొన్ని మెచ్యూరిటీలపైనే బ్యాంకు ఈ వడ్డీరేట్లను పెంచింది. రూ.కోటిలోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు అలాగే ఏడాది నుంచి రెండేళ్ల వరకు, రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్లు ఉన్న డిపాజిట్లపై ఈ పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సాధారణ ప్రజలకు గతంలో 6.7 శాతంగా వడ్డీ ఉండేది... అది ఇప్పుడు సవరించిన కొత్త వడ్డీ రేట్లతో 6.8 శాతానికి పెరిగింది. ఇక రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు డిపాజిట్ చేసిన కస్టమర్లకు గతంలో ఉన్న 6.75 శాతం వడ్డీ ఇప్పుడు 6.8 శాతానికి చేరింది. మరోవైపు సీనియర్ సిటిజన్ల విషయంలో ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 7.2 శాతం ఉన్న వడ్డీ ఇప్పుడు 7.3 శాతానికి చేరుకుంది. అదేవిధంగా రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్ల చేసిన సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం ఉన్న వడ్డీ రేటు 7.3 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఇక ఎస్‌బీఐ స్టాఫ్ తో పాటు పెన్షనర్ల వడ్డీ రేట్లు వీటి కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే వృద్ధుల వడ్డీ రేటు 0.5 శాతం ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.