ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (SBI) రోజూవారీ నగదు ఉపసంహరణను మరింతగా తగ్గించింది. అక్టోబర్ 31 నుంచి మ్యాస్ట్రో, క్లాసిక్ కార్డు వినియోగిస్తున్నవారు 20వేలు
మాత్రమే ఏటీఎంల నుంచి డ్రా చేసుకోగలరని బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 40 వేలు డ్రా చేసుకోవడానికి ఉన్న వెసులు బాటును తగ్గించింది. అయితే ఈ రెండు డెబిట్ కార్డులు మినహా మిగతా వేరియంట్ ఎస్బీఐ డెబిట్ కార్డులు వినియోగిస్తున్నవారికి మాత్రం ఈ పరిమితి వర్తించదని పేర్కొంది. ఈ నిర్ణయం కారణంగా మోసాల మీద నిఘా ఉంచడానికి అవకాశం ఏర్పడంతో పాటు, డిజిటల్ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
ఒకవేళ రోజూవారీ పరిమితి కంటే ఎక్కువ మొత్తం ఉపసంహరించుకోవాలంటే హయ్యర్ వేరియంట్ కార్డు దరఖాస్తు చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది. ఈ నిర్ణయం కారణంగా మోసపూరిత లావాదేవీలను గుర్తించడం సులభమవుతుందని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ సీకే గుప్తా అన్నారు. ఈ నిర్ణయం చాలామంది కస్టమర్ల మీద ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే బ్యాంకుకు హయ్యర్ వేరియంట్ డెబిట్ కార్డు ఉన్న వినియోగదారులు ఉన్నారని, వారి మీద ఇది ప్రభావం చూపదన్నారు.