ఢిల్లీ: బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురావడం ద్వారా దాదాపు 40లక్షల
ఉద్యోగాలు కల్పించొచ్చునని కేంద్రం పేర్కొంది. ఆ లక్ష్యంతో కేంద్రం రూపొందించిన కొత్త టెలికాం విధానానికి 5జీ కి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ (ఎన్డీసీపీ) -2018 పేరుతో రూపొందించిన ఈ విధానంతో 5జీ సాయంతో హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దేశంలో విస్తృతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాక దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటు ధరలోనే ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. దేశంలో సెకెనుకు 50 మెగాబైట్ల వేగంతో 5జీ సేవలను విస్తృతం చేయడం ద్వారా 2020 నాటికి 40లక్షల ఉద్యోగాలు ఇవొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే సాంకేతికంగా భారత్ మరింత దూకుడుగా ముందుకు సాగుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.