సెల్ ఫోన్ అమ్మకాలు అందులోనూ స్మార్ట్ ఫోన్ విక్రయాలు తగ్గిపోయాయి. భవిష్యత్తంతా స్మార్ట్ ఫోన్లదే అని ధీమాగా ఉన్న సంస్థలకు ఇదో హెచ్చరికలా పనిచేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు... అమ్మకాలు తగ్గిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నాయి.
దేశంలో సెల్ ఫోన్ అమ్మకాలు తగ్గాయి. మొబైల్ అమ్మకాలు ఇలా తగ్గడం... గత 20 ఏళ్ళలో ఇదే ప్రథమం. ఈ ఏడాది జనవరి- మార్చి మధ్య కాలంలో... సెల్ ఫోన్ అమ్మకాలు 14.5 శాతం తగ్గాయని సైబర్ మీడియా రీసెర్చ్ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో 6.2 కోట్ల మొబైల్ ఫోన్లు విక్రయమయ్యాయి. ఆ తర్వాతి మూడు నెలల్లో... 5.3 కోట్ల ఫోన్లే సేల్ అయ్యాయి. అంటే... దాదాపు కోటి సెల్ ఫోన్ల షాపుల్లోనే ఉండిపోయాయి.
మరోవైపు.... స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కూడా 7.4 శాతం తగ్గిపోయాయి. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో.... సెల్ కంపెనీలకు ఇది కొంచెం షాకింగ్ న్యూసే. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మందగించడం తయారీదార్లను కలవరపెడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇలా అమ్మకాలు తగ్గిపోవడంపై దృష్టి సారించిన పలు కంపెనీలు... వాస్తవిక కారణాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక... తక్కువ ధరకు లభించే సాధారణ ఫీచర్ ఫోన్ అమ్మకాలు... 18.3 శాతం క్షీణించాయి.