అమరావతి: టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీఎస్ఆర్టీసీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని
ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ... తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల వద్ద మొదటి దశగా ఆందోళన చేపడతామని నేతలు ప్రకటించారు. కాగా... తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో కలిపేంతవరకు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.