అమరావతి: సీఎం జగన్ దైవ కార్యక్రమాల్లో నియామాలను ఉల్లంఘిస్తూ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ
ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. ఢిల్లీ పర్యటన ఉందనే సాకుతో సంప్రదాయాలను పక్కన పెట్టి అమ్మవారికి ముందుగానే పట్టు వస్త్రాలు సమర్పించారని ఈ హక్కు జగన్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. వారిని రిలీవ్ చేయకుండా సీఎం వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రావణ పాలన జరుగుతోందని ఉమ ధ్వజమెత్తారు.
మరోవైపు... కమిషన్ల కక్కుర్తి కోసం పోలవరం ఎత్తు తగ్గింపుకు కుట్ర పన్నుతున్నారని దేవినేని ఆరోపించారు. జలాశయాల్లో 150 టీఎంసీల నీరు నింపే అవకాశం ఉన్నప్పటికీ ఆ పనిచేయకుండా నీటినంతా వృధాగా సముద్రం పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలతో తాజాగా... ఓ మహిళా ఎంపీడీఓ రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందన్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. భూ సర్వే టెండర్లలో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం అందాల్సి ఉండగా ఆ సంఖ్యను భారీగా కుదించారని ఆరోపించారు.