తిరుమల తిరుపతి దేవస్థానంతో వివాదాలు ముడిపడి ఉంటాయేమో. తాజా వివాదం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. టీటీడీ సభ్యుడిగా రాజేశ్ శర్మ అనే వ్యక్తి నియామకం, ప్రమాణ స్వీకారం
విషయం వివాదాస్పదమైపోయింది. పప్పులో కాలేసిన ఏపీ దేవాదాయ శాఖ అధికారులు అభాసు పాలయ్యారు. అసలే తికమకలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు మరింత తికమకలో పడిపోయారు. ఇంతకూ ఈ వివాదం ఎలా మొదలైంది? బాధ్యులెవరు? ఏం చేయబోతున్నారు అన్నదానిపై సీవీఆర్ కథనం...
టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ అనే పేరుతో ఒకరు నియమితులయ్యారు. ఆ ప్రముఖుడు ఎవరు అన్నది ఇంత వరకు టీటీడీ పెద్దలెవరికీ తెలియదు. ఇటీవలే మొత్తం 36 మందితో టీటీడీ బోర్డు కొలువు తీరింది. జంబో బోర్డు అన్న అపప్రథా మూటగట్టుకుంది. వీరిలో 24 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు కూడా. ఇంకా రమేశ్ శెట్టి, సుధా నారాయణమూర్తి, డీపీ అనంత, రాజేశ్శర్మ మిగిలిపోయారు. ప్రత్యేక ఆహ్వానితుల్లో హైదరాబాద్ కు చెందిన గోవిందహరి కూడా ప్రమాణం చేయాలి. ఇక వీరిలో బోర్డు సభ్యుడైన రాజేశ్ శర్మ పేరు విషయంలోనే వివాదం ఏర్పడింది. ఇంతకూ సదరు ప్రముఖుడు ఎవరు అన్న టీటీడీ పెద్దలను తికమకపెడుతోంది. ఎందుకంటే రాజేశ్ శర్మ పేరుతో ఢిల్లీకి చెందిన బీజేపీ నేత, మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి ముందుకు వచ్చారు. వీరిలో అసలు రాజేశ్ శర్మ ఎవరు? ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించాలి అన్నది తెలియక గందరగోళం నెలకొంది.
దీనిపై లోతుగా ఆరా తీస్తే... అసలు విషయాలు వెల్లడవుతున్నాయి. టీటీడీ సభ్యుడిగా ముంబై నగరానికి చెందిన రాజేష్ శర్మను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నియమించింది. ఆహ్వానం మాత్రం ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మకు వెళ్లింది. ఈ విషయంలో దేవాదాయ శాఖ పప్పులో కాలేసింది. ఈ విషయాలేవీ తెలియని తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం గుడ్డిగా ఢిల్లీకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు అక్టోబర్ 3న ముహూర్తం కూడా నిర్ణయించింది. ఇక ఇద్దరు రాజేష్ శర్మలు తిరుమలకు రావడంతో టీటీడీ అయోమయంలో పడిపోయింది. ఇక టీటీడీ సభ్యుడిగా తనను నియమించిన విషయాన్ని ముంబైకి చెందిన రాజేష్ శర్మ ఏపీ సర్కారుకు తెలిపారు. దీంతో అసలు విషయం తెలిసి అంతా నాలుక కరుచుకున్నారు. ఇంకేముంది..? అక్టోబర్ 3న కాకుండా అక్టోబర్ 5న ముంబైకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణస్వీకారానికి టీటీడీ ముహూర్తం పెట్టింది.
మొత్తానికి తప్పు ఎవరిదో తెలియదు కానీ... అటు ఏపీ సర్కారు... ఇటు టీటీడీ అభాసు పాలయ్యాయి. ఇక జరిగిన తప్పిదానికి బాధ్యులు ఎవరు అన్న విషయంలో ఏపీ దేవాదాయ శాఖ గుంభనంగా ఉండిపోతోంది. ఈ విషయంలో తమ బాధ్యతేమీ లేదంటోంది టీటీడీ. ఏపీ సర్కారు నుంచి ఉత్తర్వులు రావడంతోనే తాము ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందన్నది బోర్డు అభిప్రాయం. ఎవరిని నియమిస్తారన్నది తమ పరిధిలోని అంశం కాదు కదా అని బోర్డు అధికారులు అంటున్నారు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ సభ్యుల నియామకం విషయంలో అనేక వివాదాలకు ఆస్కారం ఏర్పడిన తరుణంలో అసలు సభ్యుడెవరో గుర్తించకుండానే గుడ్డిగా ముందుకు వెళ్లడాన్ని ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్నలకు అసలు సమాధానాలు రావడం లేదు.