కర్నూలు: ఎన్ని సమస్యలు ఉన్నా అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ రోజు ఆయన కర్నూలులోని
ఎమ్మిగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి తన ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు మొత్తం 14ఏళ్ల పాలనలో వర్షాలు లేక తీవ్ర కరువు నెలకొందని విమర్శించారు. గత ఐదేళ్లలో రెవెన్యూ రికార్డులు అన్ని తారుమారు చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బడా కాంట్రాక్టర్లకు మొదట బిల్లులు పంపిణీ చేసి చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేశారన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు సీఎం మా ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ర్టాన్ని పాలించే రాజు జాతకాన్ని బట్టే ప్రకృతి సహకరిస్తుందని, అందుకే జగన్ హయాంలో కావాల్సినన్ని వర్షాలు కురుస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు.