అమరావతి: సీఎం జగన్ పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు ఇసుక పంపిణీకి సెప్టెంబరు 5న ముహూర్తం పెట్టారని, అయినా సరిగ్గా అమలు చేయడంలేదని సీఎంపై సెటైర్లు వేశారు
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఈ రోజు ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ హరిచందన్‌ను కలిసి వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై వినతిపత్రం అందచేశారు. అనంతరం కన్నా మాట్లాడుతూ... ఇసుక లేక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డా సీఎంలో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. మన ఇసుకను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని చెప్పిన సీఎం తీరు మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే ఉందని కన్నా దుయ్యబట్టారు. సీఎం మాటలకు చేతలకు పొంతన లేదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం లేదని, ఆలయ భూములను సొంత భూముల్లా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే... అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలని కన్నా డిమాండ్ చేశారు.