అదో వేడుక, ప్రకృతిని కొలిచే పండుగ, ఆదివాసీయుల ఆత్మీయతకు వేధిక, గూడెంలో సేదతీరే ఆదివాసియుల ఆత్మీయ పలకరింపులకు సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనం ఆ జాతర. అదే నాగోబా జాతర.... సమ్మక్క సారలమ్మ జాతర తరువాత అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న జాతర ఈ నాగోబా జాతర. పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని మెస్రం మంశీయులు నేటి అర్ధరాత్రి తమ ఆరాద్య దైవమైన నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఉత్సవాలు వారం రోజులపాటు జరుగుతాయి. గిరిజనుల ఇలవేల్పుగా భక్తుల కోర్కెలను తీర్చే కొంగుబంగారంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది.
నాగోబా జాతర...అందమైన ప్రకృతి పూజ ఆత్మీయ ఆలింగనాలకు వేదిక, ఆచార వ్యవహరాలు, సాంప్రదాయాల మేళవింపు ఈ వేడుక. గిరిజనులంతా సంప్రదాయాన్ని ఐక్యతను జారుపుకొనే పండుగ ఇది. తమకు ఆశ్రయం ఇచ్చిన అడవి తల్లిని ఈ నాగదేవత కాపాడుతుందని వారి నమ్మకం అందుకే జాతర జారిగే రోజులన్నీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలంగాణా నుంచే కాకుండా , ఆంద్ర , మహరాష్ట్ర , ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుండి గూడ వేలాదిగా భక్తులు విచ్చేసి నాగదేవత దీవెనలు పొందుతారు.
ఎంతో మహిమాన్వితమైన నాగోబాను దర్శించు కోవడం వల్ల సకల సమస్యలు దూరమై మంచి జరుగుతుందనేది భక్తుల ప్రగాడ నమ్మకం. అంతేకాకుండా సంతానం లేనివారికి సంతానప్రాప్తితో పాటు పెళ్లికాని వారికి కళ్యాణ యోగం సిద్దిస్తుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. కోర్కెలు నెరవేరిన భక్తులు మరుసటి యేడాది ఇక్కడికి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు.ఈ ప్రాంతంలో పంటలు సమృద్దిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో వర్దీళ్లాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అడవి తల్లిని నమ్ముకున్న ఆదివాసీయులు పూజలు పునస్కారాలు వారి నిత్యజీవితంలో బాగంగా బావిస్తారు, ఆచార వ్యవహారాలలో ఎక్కడ రాజీ పడకుండా తమ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
ఓ వైపు సంప్రదాయ బద్దంగా జరిగే జాతరతోపాటు, మరోవైపు లక్షలాదిగా తరలివచ్చే భక్తులతో యాత్రా స్థలం కోలాహలం గా మారిపోతుంది. పూజలు భజనలతోపాటు వినోదాలకు కూడా కొదవ ఉండదు . గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నాగోబా జాతర ప్రదాన వేదికగా నిలుస్తోంది.