మన తెలుగు వారి పెద్ద పండుగ మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. మూడు రోజుల పాటు జరిగే పండుగలో మొదటి రోజు 'భోగి'. భోగి పండుగ అనే పదానికి 'తొలినాడు' అనే అర్ధం ఉంది. అనగా పండుగ తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం.
దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు. ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలే భోగిమంటలు. కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెం వేడెక్కుతుంది. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్ళలో చేమంతి, బంతి పూరేకలు, అక్షింతలు, చిల్లర నాణేలు, పాలకాయలు కలిపి పిల్లల తలపై పోస్తారు.
భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని... దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాధ. శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ... గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదేనని శెలవిచ్చాడు. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నను భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాథలు.
భోగి మంటలు:

సాధారణంగా అందరు చెప్పేది... ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు... ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికి వస్తే అందరికి ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకొలేని పేదలు ఉంటారు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్నిదేవుడికి ఆరాధనా, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం. కానీ మనం ఫ్యాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు... మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.
భోగి పళ్లు:

భోగి రోజున భోగి పళ్లు పేరుతో రేగి పళ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత నామం. రేగి చెట్లు, రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.
మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్యకిరణలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడంతో... వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువల్లే పిల్లలకి భోగి పండ్లు పోసి అశ్వీరదిస్తారు. మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సంప్రదాయాలను మూఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులవుతాయి.
భోగం కలిగింది భోగి. భోగమంటే ఆనందాన్ని అనుభవించడమని అర్థం. భూమి తాను సంతృప్తిగా ధాన్యాన్ని ఇచ్చాననే ఆనందాన్ని అనుభవిస్తూ, వృషభం తన శ్రమకి ఫలితం లభిస్తుంది. ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా గాదెలకు చేర్చగలిగాననే సంతోషంతో యజమాని గాదెలన్నీ నిండాయనే ఆనందాన్ని అనుభవిస్తూ, పిచ్చుకలు- కంకులనిండా ఉన్న ధాన్యాన్ని తినగలుగుతున్నామనే తృప్తితో... ఇలా పశు, పక్షి, మానవ జీవరాశులన్నీ భోగంతో గడుపుకునే పండుగ కాబట్టి భోగి.
నిజమైన భోగం ఆనందానుభవం ఎప్పుడంటే ఆకాశ వర్షం భూమికి చేరి పంట చేతికొచ్చినప్పుడే. అందుకే ధరణి నుంచి పుట్టిన గోదాదేవికి ఆకాశ రాజపుత్రుడైన రంగనాథునితో కల్యాణాన్ని చేస్తారు. పంచభూతాల్లో మొదటిదైన పృథివి ఆ చివరిదైన ఆకాశంతో సమన్వయపడి ఉంటే ఇంక పంచభూతాత్మక ప్రపంచానికి తిరుగేముంది? కాబట్టి భోగి. ఒక ఆంతర్యం. ప్రాతఃకాలంలోనే తల్లులందరూ తమ పిల్లల్ని నిద్రలేపి వాళ్ల మాడున నువ్వులనూనెని అద్దుతూ ఆశీర్వచనాలని హృదయపూర్వకంగా చేసి, ఎక్కడా ఏ రక్తనాళంలోనూ రక్తప్రసరణ మందంగా ఉండకుండా ఉండేలా బలంగా శరీరాన్ని మర్దించి నలుగుపెట్టి, శిరోజాల్లో క్రిమికీటకాలు చేరకుండా ఉండేలా కుంకుడు రసంతో రుద్ది, అభ్యంగస్నానాన్ని చేయించి వాళ్లకి సుఖనిద్ర కలిగేలా చేస్తారు. స్వేదరంధ్రాలన్నీ తెరుచుకున్న కారణంగా శరీరానికి ఆనందానుభవం కల్గిస్తుంది ఈ పర్వదినం. అందుకే ఇది భోగి. ఆరోగ్యపరమైన ఆంతర్యం ఇది.
ఏ విధమైన పరిశోధనా పరికరం లేకుండా ఖగోళంలో ఉన్న గ్రహగతుల్నీ వాటిద్వారా వ్యక్తులకి కలిగే మేలు- కీడులని తెలియజేయడం కోసం ఈ నేలని ఆకాశంగా చేస్తూ గ్రహాలు తిరిగే మార్గాలని ముగ్గుగీతలుగా చేస్తూ, ఈ తీరు గ్రహ పరివర్తన కారణంగా వర్షం ఎంత పడుతుంది? ఎంత దూరంలో పడుతుంది? ఆ స్థాయి వర్షబలంతో ఏ పంట పండుతుంది? ఇలా అన్నింటినీ వ్యవసాయదారులు నేలమీదే చూసి తెలుసుకుని ఆనందానుభూతితో గడుపుకునేది భోగి.
గాలిపటాలు:

వాతమంటే గాలి పరివర్తన దిశకి సంకేతం. పటమంటే వస్త్రం. ఒకప్పటి రోజుల్లో వస్త్రంతో చేసిన గాలిపటాలను ఎగురవేస్తూ ఉండేవాళ్లు. ఆ సూర్యునికి ఆహ్వానాన్ని అక్కడికి వెళ్లి పలకలేం కాబట్టి ఇక్కడి నుంచి గాలిపటాలను ఎగురవేసి స్వాగతించడంలో ఓ ఆనందానుభవాన్ని పొందడం భోగి. మరో విశేషమేమిటంటే ఉత్తరాయణం రాబోతున్న రోజున గాలి వేగం ఎంతతో ఉందో, గాలి ఏ దిశగా వీస్తోందో, దానిలో తేమ ఎంత శాతముందో, దాన్ని బట్టి రాబోయే కాలంలో పంట దిగుబడిక్కావలసిన వర్షపాతాన్ని లెక్కించగలరు రైతులు. ఆ కారణంగా వాళ్లకి రాబోయే పంట సమాచారాన్ని తెలుసుకోగలిగామనే ఆనందానుభవం భోగి.
భోగము అంటే పండుగ. అది కలిగినది భోగి అంటే పాము. ఆ కుండలిని శరీరానికి ఉత్తరంగా ఉండే శిరస్సులోనికి ప్రయాణం చేస్తూ మెల్లమెల్లగా సహస్రారంలో ఉండే దైవాన్ని దర్శించి ఆనందానుభవాన్ని పొందడం భోగి. ఇది యథార్థం కాబట్టే కార్తీక త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలు కలిసిన అవమ తిథినాడు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్న భీష్ముడు... మార్గశీర్ష శుద్ధ దశమినాడు అంపశయ్యని చేరే ఆనందానుభవం లభించే భోగిని దాటి, అష్టమీ తిథి రోహిణీ నక్షత్రంలో కృష్ణునిలో లీనమయ్యాడు. కేవలం యోగమార్గంలో ఆనందానుభవాన్ని పొందడమే ఆయన లక్ష్యమైనా అష్టమి, రోహిణి అనే రెంటికోసమే మరికొన్ని రోజులు తన శరీరాన్ని త్యజించకుండా ఆపాడు.
తెలుగు జాతి పౌరుషాలకు ప్రతీకలుగా ఎర్రఎర్రని మిరపపళ్లు కోతకు వస్తాయి. పంటచేను దిబ్బల మీద వంగలు, బెండలు, చిక్కుళ్లు, సొరపాదులు విరగకాసి బరువెక్కేది ఇప్పుడే. కవిసమ్రాట్ విశ్వనాథ తన తెలుగు రుతువులు కావ్యంలో మంచి గుమ్మడి పువ్వులో నిలిచిన మంచు బిందువు, తట్టలో కూర్చున్న పెళ్ళి కూతురులా ఉందని వర్ణించారు. గుమ్మడి పచ్చపచ్చగా పూలు పూసేది... మంచుకురిసేది ఈ ధనుర్మాసంలోనే.
నాడు వ్యవసాయం జీవనం. కానీ నేడు ఆ జీవనం తక్కువే. శ్రమ జీవులు, వినోదాలు, అవసరాలు వ్యవసాయదారుని ఆశ్రయించుకుని అతని చుట్టూ తిరిగాయి. క్రమంగా స్థితిగతులు మారిపోయాయి. వ్యవసాయానికి నాగలి నుంచి కొడవలి దాకా ఎన్నో పనిముట్లు కావాలి. అందుకోసం వడ్రంగి, కమ్మరి ఉండి తీరాలి. పొలానికి ఇంటికి బానలు, బుంగలు, కడవలు, పిడతలు, చట్లు, మూకుళ్లు, ప్రమిదలు కావాలి. ఇవన్నీ కనిపించనంత దూరంగా జరిగిపోయాయి. కారణాలు ఏవైనా పల్లెలు మాత్రం ఛిద్రమయ్యాయి. ఊళ్ళకి కళ తప్పింది. అనేక జానపద కళారూపాలు, జానపద వాద్యాలు కనుమరుగయ్యాయి. బతుకు తెరువు కోసం వెళ్ళిపోయాయి. మొత్తం మీద ఒక గొప్ప పనితనాన్ని, సంస్కృతిని కోల్పోయిన మాట అయితే వాస్తవం. అగ్గిపెట్టిలో చీరను పెట్టిన చరిత్ర మనది. ఆ చీరకు నూలు తీసిన కళాకారుల హస్తవాసిని తిరిగి చూడగలమా? కొయ్యను బంగారం చేసే వడ్రంగి, ఇనుముని పుత్తడి చేయగల కమ్మరి, బంకమట్టిని సారెతో సువర్ణం చేసే కుమ్మరి మన కళ్లెదుట కనుమరుగైన కులవృత్తి బ్రహ్మలు. అరిశెలు, బెల్లపులడ్లు, కొమ్ము మిఠాయి, చకినాలు, చక్కలు సంక్రాంతి పిండి వంటలు. నాలుగిళ్ళ వారు చేరి సమష్టిగా ఇవన్నీ చేసుకుని బానలకు ఎత్తేవారు. కొత్త అల్లుళ్లు రావడం వేడుక. పాత అల్లుళ్ళు రావడం వాడుక. ఊరు మీద ఊరు వచ్చి పడినట్టుండేది. ఇప్పుడు సొంత ఊళ్ళలో అంతో ఇంతో మమకారం ఉన్న వాళ్లు నగరాల నుంచి పండక్కి వెళుతున్నారు. అలనాటి భోగి మంటల్లో ఇప్పుడు కొత్తగా ఆచరిస్తున్న స్వచ్ఛభారత్ పోలికలు కనిపిస్తాయి. చెత్తా చెదారం తెచ్చి భోగిమంటలో వేసేవారు. అదొక ఉద్యమంలా ఉత్సవంలా నడిచేది.
ఇప్పుడు గ్రామాలకు వెళితే వెతికి చూసినా శ్రమించే పశువులు కనిపించవు. అక్కడక్కడ మాత్రం పాలిచ్చే పశువులు కనిపిస్తాయి. ఒక ట్రాక్టర్ వంద ఎడ్లు చేసే పని చేస్తుంది. డీజిల్ తప్ప వేరే పోషణ భారం ఉండదు. రైతుకి ఇప్పుడు పూర్వం లాగా ఎడ్లకి, దున్నలకి కృతజ్ఞతలు చెప్పే పనిలేదు. కనుమపండుగకి ఇప్పుడు అర్థమే లేదు. మనకి సెంటిమెంట్లమీద భయం ఎక్కువ. అందుకని ఎక్కడున్నా పిల్లల తలమీద భోగిపళ్ళు పోసి ఊపిరి పీల్చుకుంటారు. బస్తీల్లో, నగరాల్లో బొమ్మల కొలువులు స్టేటస్ సింబల్ అయ్యాయి. ఇటాలియన్ మార్బుల్స్‌ని, యూరోపియన్ క్రిస్టల్స్‌ని గొప్పింటి పేరంటంలో చూడొచ్చు. సినిమాల్లో తరచుగా సంక్రాంతి సన్నివేశాలు కనిపిస్తూంటాయి. పూర్తిగా స్టూడియో సెట్టింగ్‌లతో, చిత్ర విచిత్రమైన వేషధారణలో నాయికా నాయకులతో పాటు ఇంకా కొందరు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతుంటారు. దీన్ని నేటివిటీకి దర్పణంగా భావిస్తారు. కానీ తెలిసిన ఏ ప్రేక్షకుడూ అలా పొరబడడు. శిల్పారామంలో కూడా ఈ తంతు ఒక వేడుకే.