హాయిగా నిద్రపోవాలంటే మీరు తినే ఆహారంలో ఉప్పును తగ్గించండి అంటున్నారు వైద్యులు. వయసు మళ్లినవారికి ఇది మరింత మేలుచేస్తుందట. పదేపదే మూత్రానికి వెళ్లేవారికి నిద్రలేమి సమస్యలు వస్తాయి. దీంతో పగలంతా చికాకుగా ఉంటారు. అందుకే రాత్రిపూట మాత్రం ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే సరిపోతుందని మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లే అవసరం రాదని చెబుతోంది ఒక యూరప్ రీసెర్చ్.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో సోడియం మోతాదు పెరుగుతుంది. దీంతో కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగిపోతుంది. రక్తం పరిమాణం ఎక్కువైతే మూత్రం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, రక్తం పరిమాణంతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలు మరింత ఎక్కువగా నీటిని ఒంట్లోంచి బయటకు పంపటానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని కాస్త తగ్గిస్తే రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండానే కాదు, కంటి నిండా నిద్రపోయేలానూ చూసుకోవచ్చు.