మీకు పొట్ట సమస్యలేమైనా ఉన్నాయా? తిన్నది అరక్క పోవడం, తిరగబెట్టడం లాంటి ఇబ్బందులతో బాధ పడుతున్నారా? పేగులు మెలితిరగడం, అదే పనిగా కడుపు నొప్పి రావడం తదితర ఫిర్యాదులతో సతమతమవుతున్నారా? అయితే, మీకో గుండు వైద్యం అందుబాటులో ఉంది.
ఇదేం చేదు గుళిక కాదు, ఆపరేషన్ తో పని లేదు. కేవలం దీని కింది నుంచి అటూఇటూ పలుమార్లు దూరితే చాలు మీ పొట్ట సమస్యలు ఇట్టే మాయమవుతాయి. ఇది మూఢ నమ్మకమని భావించే వారు కొందరైతే, శాస్త్రీయంగా ఇది సాధ్యమేనని మరికొందరు రాయి గుద్ది మరీ చెబుతున్నారు.
నిజామాబాద్ నగరానికి సమీపంలో గల మల్కాపూర్ గ్రామ సమీపంలో ఒక భారీ గుండు(బండ రాయి) ఉంది. సుమారు పదడుగుల ఎత్తులో హృదయం ఆకారంలో ఉండే ఈ బండ రాయి ఈ ప్రాంత వాసులకు ఆరాధ్యంగా మారింది. దీన్నో మహత్తర శక్తి గల రాయిగా కొలిచే స్థాయికి చేరింది. ఇది ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదు కానీ, తరతరాలుగా ఈ ప్రాంత వాసులు ఈ రాయిని శారీరక సమస్యలు దూరం చేసే గుండుగా కొలుస్తున్నారు. కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి, పేగు సంబంధ వ్యాధులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి తదితరాలతో బాధ పడే వారు దీని కింది నుంచి పలు మార్లు అటూ ఇటూ దూరితే ఆరోగ్యం కుదుట పడుతుందని స్థానికులు నమ్ముతున్నారు. ఈ కారణంగానే దీనికి 'మకిలి గుండు' అనే పేరొచ్చింది.
సాధారణంగా వ్యవసాయ పనులు చేసే వారు ఇలాంటి ఇబ్బందులతో బాధ పడుతుంటారు. పంట పొలాల్లో గట్లపై తిరిగేటపుడు కాలు స్లిప్ కావడం, గంటల తరబడి వంగుతూ, లేస్తూ ఉండడం, ఎరువులు, క్రిమి సంహారక మందుల ప్రభావం తదితరాలతో వారు అనారోగ్యం పాలవుతుంటారు. ఇందులోఎక్కువగా పొట్ట, వీపు, నడుము సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. ఈ గుండు కింది నుంచి బోర్లా పడుకుని దూరడం వల్ల పొట్టకు మంచి ఎక్సర్ సైజ్ జరుగుతుంది. దీని కింది నుంచి వెళ్ళేపుడు పొట్టను లోపలికి బిగ పట్టుకుని, పాకుతూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కారణంగా సహజంగానే పొట్ట సంకోచ వ్యాకోచాలతో వ్యాయామం అవుతుంది. నడుము, వీపు పై ఒత్తిడి ఏర్పడి ఏవైనా ఇబ్బందులుంటే సడలుతాయి. ఇలా పలుమార్లు చేస్తే శరీరంలోని నొప్పులు, పొట్ట సంబంధ సమస్యలు దూరమవుతాయి. ఈ ప్రభావం వల్ల 'మకిలి గుండు'గా పిలువబడే ఈ రాయి ఒక మహత్తర శక్తి గల గుండుగా మారింది.
ప్రస్తుతం దీన్ని చూడ్డానికి, దీని కింద నుంచి దూరడానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడే వారు తెల్లవారుఝామునే స్నాన పానాదులు ముగించుకుని, ఖాళీ కడుపుతో ఈ ప్రక్రియ చేపట్టాలి. సమస్య తీవ్రతను బట్టి కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం కొనసాగించాలి. ఎలాంటి మందులు లేకుండానే సమస్య దూరమవుతుందని ఈ ప్రాంత వాసులు విశ్వసిస్తున్నారు. కొందరు ఒడ్డెరలు ఈ రాయిని కంకరగా మార్చే ప్రయత్నం చేయగా అడ్డుకున్నామని చెబుతున్నారు.