హైదరాబాద్: ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌కు పంపించేముందు దరఖాస్తుదారులు సరి చూసుకునేందుకు రవాణాశాఖ అధికారులు
అవకాశం కల్పించారు. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డుల ప్రతులను దరఖాస్తుదారుల వాట్సాప్, మెయిల్స్ ద్వారా పంపాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ప్రింటింగ్ సమయంలో తలెత్తే తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్టు రవాణాశాఖ జాయింట్ కమిషనర్, ఆన్లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ చైర్మన్ రమేశ్ ఈ రోజు మీడియాకు తెలిపారు. రమేశ్ అధ్యక్షతన సమావేశమైన ఆన్లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ పలు సరికొత్త నిర్ణయాలు తీసుకొన్నది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేశామని.. రవాణాశాఖ అందించే సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొంటామని రమేశ్ చెప్పారు. సోమవారం నుంచి పెండింగ్ కార్డులను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.