ఎవరి ఒత్తిడితోనూ నేను సర్వే వివరాలు మార్చలేదు..అయినా కేటీఆర్
నాపై సర్వే వివరాలు మార్చానని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేటీఆర్ మంగళవారం నాడు లగడపాటిపై చేసిన ఆరోపణలకు ఆయన స్పందించారు. బుధవారం మీడియాతో లగడపాటి మాట్లాడుతూ కేటీఆర్ నన్ను కలిసినపుడు సర్వే వివరాలు అడిగారని, రిపోర్టులు పంపిస్తానంటే ఈ మెయిల్ ఐడీ ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామనీ, వారందరూ కలిస్తే టీఆర్ఎస్, కూటమికి హోరాహోరీగా పోటీ జరిగే అవకాశాలున్నట్లు కేటీఆర్ కు చెప్పానని లగడపాటి పేర్కొన్నారు. వీలైతే ఈసారి టీఆర్ఎస్ కూడా పొత్తులతో పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయని, టీఆర్ఎస్ ఒక్కటే పోటీకి దిగితే 65 శాతం ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత కేటీఆర్ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే చేసి ఫలితాలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారని, నవంబర్ 11న మరో 37 నియోజకవర్గాల జాబితా పంపించారని, రెండు జాబితాల అభ్యర్థులపై సర్వే చేయగా 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుందని సర్వేలో వెల్లడైనట్లు చెప్పారు. సర్వే వివరాలు చెప్పిన తర్వాత ‘మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని కేటీఆర్కు మెసేజ్ చేశా’అని లగడపాటి వివరించారు. నేను చేసిన దానిలో ఏం తప్పు ఉందని కేటీఆర్ అలా ఆరోపణలు చేశారో నాకు అర్థం కావడం లేదన్నారు. అయినా ఎవరినీ భుజానెత్తుకోవడానికి తాను సర్వే చేపట్టలేదన్నారు లగడపాటి. అన్ని వివరాలు కేటీఆర్ కు చెప్పాక కూటమి ఏర్పడక ముందే చంద్రబాబు ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని, టీడీపీ - టీఆర్ఎస్ కలిస్తే విజయం ఏకపక్షమవుతుందని స్పష్టంగా చెప్పినా, కేటీఆర్ మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో నిలబడతామని అన్నట్లు లగడపాటి మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే తాను గజ్వేల్ సర్వే ఫలితాలను వెల్లడించబోనని, ఎన్నికల తర్వాత అక్కడ ఎవరుంటారో, ఎవరు పోతారో వారికే తెలుస్తుందన్నారు.