హైదరాబాద్:చంద్రబాబు ఆంధ్రబాబే నంటూ విమర్శించారు టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా పొత్తులు పెట్టుకుంటోందని
మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నల లేఖను విడుదల చేస్తున్నానని వాటికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కాకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని ప్రశ్నించారు. సాగునీరు, ఆస్తుల పంపకం, ఉమ్మడి హైకోర్టు విభజన సహా అనేక అంశాలపై చంద్రబాబు అడ్డుపడుతున్నారని తెలిసి కూడా ఆయనతో పొత్తు ఎందుకు అని నిలదీశారు. తెలంగాణ కోసం ఒక్క ఉత్తరం కూడా కేంద్రానికి రాయని వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. ఆయనపై ఆధారపడిన టీడీపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడితే రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా గండి పడుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని... ఆయనెప్పుడూ తెలంగాణ రాష్ట్రం వైపు ఉండరన్నది జగమెరిగిన సత్యమని మండిపడ్డారు. కృష్ణా జలాల పంపకం విషయంలో చంద్రబాబు ఏ వైపు నిలబడతారో స్పష్టత నివ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహాకూటమిలో చంద్రబాబుతో పెట్టుకున్న పొత్తు షరతులతో కూడినదా? బేషరతుగా పెట్టుకున్నదా? స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా సరే.. అధికారమే కావాలన్న ధోరణి కాంగ్రెస్ అవలంబిస్తోందని విమర్శించారు.
2009లో తాము టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి పరిస్థితులు వేరన్న హరీష్ రావు... అది షరతులతో కూడుకున్నదేనని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడకుండా చంద్రబాబు చేయవల్సిందంతా చేశారని.. ఆయన అప్పుడు ఏమైనా తీర్మానం చేసి ఉంటే ఆ కాగితాన్ని ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు 30లేఖలు రాశారని... ఇప్పుడు ఆ ప్రాజెక్టు సక్రమమైనదేనని ఆయన మీకేమైనా లేఖ ఇచ్చారా? అని కాంగ్రెస్ ని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1200 మంది ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు బదిలీ చేస్తే.. వారిని విధుల్లోకి తీసుకోకుండా కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. వారందరికీ తెలంగాణ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందన్నారు. ఈ ప్రశ్నలకు మహాకూటమి విడుదల చేసే మేనిఫెస్టోలో సమాధానాలు దొరుకుతాయేమోనని ఆశిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.