నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని వణికించేస్తున్నాయి. మానవాళి హడలిపోయేలా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ ప్రాణభయం వెంటాడుతోంది. భారత్ లోనూ అడుగుపెట్టిన నిఫా ఇప్పటికే తానేంటో చూపిస్తోంది. ప్రభుత్వాలను గడగడలాడిస్తోంది.
ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధుల్లో తొలి పదింటిలో నిఫా వైరల్ ఫీవర్ ఒకటి. ఈ మాట ఎవరో అన్నది కాదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు. అందుకే అందరిలోనూ అంతగా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తదితర దేశాల్లో ప్రాణాలు తీస్తున్న ఎబోలా, జికా వైరస్‌లకన్నా ఇది ప్రమాదకారిగా మారిపోయింది. ఆసియా దేశాలను బెంబేలెత్తించిన బర్డ్ ఫ్లూ కన్నా మిన్నగా మారిపోయింది. ఒక జాతి గబ్బిలాలు దీనికి ప్రధాన కారణం. ఇక పందులు, ఈ వైరల్ ఫీవర్ సోకిన రోగుల ద్వారా కూడా ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు నిఫా రాకుండా నివారించే వాక్సిన్గాని, రోగాన్ని తగ్గించే మందులు కానీ పుట్టలేదు. కేవలం ఉపశమనం కలిగించే చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీంతో నిఫా సోకితే మరణం తప్ప మరోటి లేకుండా పోతోంది.
కేరళపై నిఫా వైరస్ పంజా విసిరింది. ఆ వ్యాధి బారిన పడి రెండంకెల మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఇదే విషయం దేశ విదేశాల్లో ఆందోళనకు కారణమవుతోంది. తొలుత 1998లో మలేషియాలో ఈ వైరస్ బయటపడింది. సుంగాయ్ నిఫా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా దీన్ని కనుగొన్నారు. అందుకే దీనికి నిఫా వైరస్ అన్న పేరు వచ్చింది. నిఫాతో మలేషియా అదే ఏడు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి సింగపూర్‌లో వెలుగు చూసింది. అక్కడ పందులు పెంచే వారు నిఫా బారిన పడ్డారు. ఆ తర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి తన ఉనికి చాటుకుంది. అక్కడే తిష్ట వేసింది కూడా. ప్రతి ఏటా శీతాకాలంలో బంగ్లాదేశ్ ను నిఫా వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తోంది.
బంగ్లాదేశ్ నుంచి భారత్ లోని కేరళకు నిఫా ప్రవేశించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి ప్రకంపనలు సృష్టిస్తోంది. గుర్తు పట్టే లోగానే పదుల సంఖ్యలో ప్రాణాలు తీసింది. 50 మంది వరకు దీని బారిన పడ్డట్లు ప్రాథమికంగా గుర్తించారు వారిలో 25 మందికిపైగా వ్యాధికి గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తున్న ఓ నర్సు కూడా నిఫా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదం. అంచనాకు అందనంత వేగంగా ఇది వ్యాప్తి చెందే ప్రమాదం డటం వల్ల ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉండబోతోందన్న హెచ్చరికలు అందరినీ హైరానాకు గురి చేస్తున్నాయి.
కోజికోడ్‌లో విజృంభించిన ప్రాణాంతక వైరస్ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడం ప్రజారోగ్య విపత్తుల పట్ల భారత్ స్పందనా సామర్థ్యానికి ఒక పరీక్షలా మారిపోయింది. ఆరోగ్య సంరక్షణ, నాణ్యత విషయంలో ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల జాబితాలో 2016లో భారత్ 145 స్థానంలో ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ తరుణంలో నిఫా మహమ్మారిని నిర్మూలించడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ప్రతి ఏడాదీ నిఫా మరణాలు సంభవి స్తున్నప్పటికీ, సుదూరంగా ఉండే కేరళలో ఆ మహమ్మారి ఇంతలా విజృంభిస్తుందని దాదా పు ఎవరూ ఊహించలేదు. కేరళ నుంచి విశాఖ, హైదరాబాద్‌లకు నిత్యం విమానాలు, రైళ్ల ద్వారా వేలాది మంది వచ్చి వెళ్తుండటంతో తెలుగు రాష్ట్రాలు కూడా సత్వరం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.