విశాఖ జిల్లా పాడేరులో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆడారిమెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన
గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన ముఖాముఖీలో మహిళలతో సంభాషించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు, పింఛను, ప్రభుత్వ పథకమైన చంద్రన్న బీమా అందుతున్న తీరుతెన్నుల గురించి మహిళలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడిన చంద్రబాబు... ఆదివాసీలకు అన్ని రంగాల్లో టీడీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని, ఎన్నడూ లేని విధంగా ఆదివాసీల అభివృద్ధికి పాటు పాటుపడుతున్నదని వారికి వివరాయించారు. 50 ఏళ్లు దాటిన గిరిజనులకు పింఛను ఇస్తామని ప్రకటించారు. ఆదివాసీల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామని, ఆదివాసీల జీవన ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. అవకాశాలు వస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఆదివాసీ యువతకు ఉందని వారిని ఆకాశానికి ఎత్తారు. గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో త్రాగునీటి కోసం రూ.397 కోట్లు ఖర్చు చేశామని, గిరిజన ప్రాంతాల్లో 153 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించామన్నారు. వాటితో పాటు 26 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పెట్టామని, గిరిజన ప్రాంతాల్లో 20 లక్షల దోమ తెరలు పంపిణీచేశామని పేర్కొన్నారు.
గిరిజనుల కోసం తాము చేస్తున్న కృషి చూసి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీతో జత కలిశారని సీఎం వివరించారు. గిరిజనులకు హాని కలిగించే బాక్సైట్ మైనింగ్‌కు దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుమతులిచ్చారని అన్నారు. గిరిజనులకు నష్టం జరుగుతుందనే తాను బాక్సైట్‌ను రద్దు చేశానని, దాని జోలికి వెళ్లలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నాపై ఎంత ఒత్తిడి తెచ్చిన ఒప్పుకోలేదని తెలిపారు. గిరిజనులకు హాని కలిగించే బాక్సైట్ జోలికి వెళ్లనని చంద్రబాబు ఆదివాసీలకు హామీ ఇచ్చారు.